Thursday, January 6, 2011

నేనొక సిటిజన్. మరి మీరు ? ( "సిటీ" జన్.. "C I T I " Z E N )

కొల్హాపూర్ కొచ్చిన కొత్తలో ఒకరోజు సిటీ చూడటానికి అని బయటకి వెళ్లాను. సిటీ మొత్తం తిరుగుతుండగా ఒక రోడ్డు నిర్మానుష్యం గా కనిపించింది .  ఇరు వైపులా షాప్ ల తో చూడటానికి చాలా బావుంది. ఆ రోడ్డు మద్య లో డివైడర్ లు లేవు. డివైడర్ లేని రోడ్డు లో వెళ్ళే వాళ్ళకీ వచ్చే వాళ్ళకీ ఇబ్బందిగానే ఉంటుంది. ఇది మన అందరికీ తెలిసిన విషయమే.కానీ ఎవరూ లేని రోడ్డులో మన మొక్కల్లమే వెళ్ళేప్పుడు ఇక ఇబ్బంది ఏముంటుంది ?. రోడ్డు లో  ముందు ఎక్కడైనా వర్క్ జరుగుతుందేమో అనుకున్నాను. అలా అయితే  "రోడ్డు పని జరుగుతుంది. నెమ్మదిగా వెళ్ళండి" అనో , లేకుంటే"దారి మళ్ళించటమైనది" అనో బోర్డు ఉండేది, లేకుంటే కనీసం ఎర్రజెండా ఐనా వ్రేలాదతీసి "స్టాప్" అని బోర్డు పెట్టేవారు కదా! .. ఇలాంటి సూచనలు, సూచీలు  ఏమీ లేకపోవటం తో నేను రాబర్ట్ ఫ్రాస్ట్ లా ఫీల్ అయిపోయి ఎ రోడ్ నాట్ టేకెన్ అనుకుంటూ ఆ రోడ్డు తీసుకున్నాను. రోడ్డు చివరకు వెళ్ళాకా బండి కి  అడ్డం గా ఓ ట్రాఫిక్ కానిస్టేబులు పడిపోయి బండి కీ లాగేస్కున్నాడు . బండి సైడ్ లో పెట్టు . ఫైన్ కట్టు అంటూ నిలబడి ఉన్నాడు.


నేనెందుకు ఫైన్ కట్టాలో తెలుసు కోవచ్చా ? అని అడిగాను.


రాంగ్ రూట్ లో బైక్ డ్రైవ్ చేసినందుకు 100 రూపాయలు  ఫైన్ కట్టు అన్నాడు.
రోడ్డు లో లెఫ్ట్ సైడ్ నే కదా నేను వచ్చింది . అది రాంగ్ రూట్ ఎలా అవుతుంది అని నేను అడిగాను.
వన్ వే లో ఎదురుగా నువ్వు రైట్ సైడ్ వచ్చినా, లెఫ్ట్ సైడ్ వచ్చినా, అడ్డం గా వచ్చినా నిలువుగా వచ్చినా అది రాంగ్ రూట్  నే అవుతుంది అన్నాడు .

రోడ్డు పై ఎక్కడా రోడ్డు వన్ వే అని గాని ,దానికి సంభందించిన గుర్తులు గాని లేవు. అలాంటప్పుడు ఇది  వన్ వే అని ఎవరికైనా ఎలా తెలుస్తుంది. ఇది వన్ వే అని నాకు తెలియదు. అన్నాను .


నాతో అనవసరం గా ఆర్గ్యుమెంట్ చెయ్యకు, ఫైన్ కట్టి కీ తీస్కో అన్నాడు.


నాది తప్పే నేను ఒప్పుకుంటాను . వన్ వే అయినప్పడు బండి వన్ వే లోనే నడపాలి  , సెకండ్ వే లో నడపకూడదు .
నా తప్పుకు  ఫైన్ గా నేను మూల్యం చెల్లిస్తాను. మరి నీ తప్పుకు ఎంత మూల్యం చెల్లిస్తావ్ చెప్పు ? ఫైన్ లు దొబ్బటం తప్ప, ఎప్పుడైనా జనాల గురించి పట్టించుకున్నారా మీరు ?    అని అడిగాను ..


ఎక్కువగా మాట్లాడుతున్నావ్ నీకు పద్దతిగా ఉండదు. అంటూ కోపం గా నా మీదికి వచ్చాడు.
అది చూసిన  వేరే ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి, అతన్ని వెనక్కి తీసుకెళ్ళి అసలు జరిగిందేమిటి అని అడిగాడు.
వీడు రాంగ్ రూట్ లో వచ్చిందే కాకుండా , ఫైన్ కట్టమని అడిగితే తప్పంతా ట్రాఫిక్ పోలీసులదే అన్నట్టు, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు . అని చెప్పాడు అతడు .

ఏరా పోలీసులదే తప్పన్నావట ? ఏంది రా తప్పు . చెప్పు అన్నాడు .


"ఫైన్ లు వసూలు  చెయ్యటానికైతే రూల్స్ , రూల్స్ అని మాట్లాడతారు .
ఇది వన్ వే ఐనప్పుడు , వన్ వే అని బోర్డ్ పెట్టాలి అని తెలీదు , కనీసం ఒక ఎర్ర గుడ్డ ముక్క కట్టటం కూడా తెలీదు. పొరపాటున వచ్చిన వాడికి ఫైన్ అయితే వెంటనే వేసేస్తారు. నా అదృష్టం బాగుంది ఇక్కడ రెడ్ లైట్ వెలిగి, ఎదురుగా ట్రాఫిక్ లేదు. ఏ మద్య లోనో ఉన్నప్పుడు గ్రీన్ సిగ్నల్ పడితే అప్పుడు నేనేం చెయ్యాలి ?, పక్కకు తప్పుకోవటానికి చిన్న పాటి ఖాళీ కూడా దొరకదు. ఒక వేళ ఏదైనా అనర్ధం జరిగి ఉంటే, పూర్తి భాద్యున్ని నేనే , ఎందుకంటే రాంగ్ రూట్ లో వచ్చాను కాబట్టి . అప్పుడు జరిగిన ప్రమాదానికి , పరిణామాలకి , మీ ప్రమేయం అసలు ఉండదు. అంతే కదా ? " అని నా కోపాన్ని అంతా వెళ్లగక్కేను.


ఇద్దరూ నాతో ఏమీ మాట్లాడలేదు, కాసేపు అలా మౌనం గా ఉండి పోయారు .
నేను ఇచ్చిన వంద రూపాయలు , బైక్ కీ తిరిగి ఇచ్చేసారు  . సర్లే నీ తప్పు లేదులే , వెళ్లి పో అన్నారు. " ఫైన్ లు వసూళ్లు చెయ్యటమే మా పని. అది సక్రమం గానే చేస్తున్నాం. కానీ ఈ రోడ్డు పక్కన బోర్డు లు వగైరాలు  ఏర్పాటు చెయ్యాల్సిన భాద్యత మున్సిపల్ కార్పోరేషన్ వాళ్ళది. వాళ్ళ పని వాళ్ళు చెయ్యలేదు . ఏది ఏమైనా సర్కారు వైఫల్యమే అని ప్రజలు  గా మీరు అంటారు "  అన్నాడు మొదటి వ్యక్తి .
    
ఫైన్ కడతాను , రిసిప్ట్ ఇవ్వండి అన్నాను.
ఫైన్ కట్టాల్సిన అవసరం లేదు . వెళ్లిపో అన్నారు.


లేదు ఫైన్ కడతాను అన్నాను గా , ఫైన్ కడతాను రిసిప్ట్ ఇవ్వండి అన్నాను .
పొద్దు పొద్దున్నే ఓ  మొండిఘటం గాడు తగిలాడేంట్రాబాబు అనుకున్నట్టున్నారు . వంద తీసుకుని చలాన్ ఇచ్చాడు .


అలా కొంత దూరం వెళ్లి పార్కులో కాసేపు కూర్చుని , మళ్ళీ వెనక్కి వచ్చాను.
వన్ వే రెండు చివర్లా చెరో ఒకరు నిలబడి ట్రాఫిక్ ని నియంత్రిస్తున్నారు వాళ్ళు . ట్రాఫిక్ పోలీసులుగా వాళ్ళ విధి వాళ్ళు సక్రమం గా నిర్వర్తిస్తున్నారు .


ఎదురుగా ఉన్న మున్సిపల్ కార్పోరేషన్ బిల్డింగ్ లోకి వెళ్లాను . "ఫిర్యాదుల పెట్టె . ." (" కంప్లైంట్ బాక్స్" ) అని దుమ్ము కొట్టుక పోయిన ఒక ఎర్ర రంగు డబ్బా కనిపించింది.


"ఉత్తర ప్రత్యుత్తర విభాగం " లో ఒక తెల్ల కాగితాన్ని అడిగి తీసుకున్నాను .


" నా నిర్లక్ష్యానికి మూల్యం గా ఈ ఫైన్ కట్టాను . మీ నిర్లక్షానికి మూల్యం గా ఒక ప్రమాదమో, ప్రాణం పోవటమో జరక్కుండా చూస్కోండి " అని రాసి , చలాన్ ను దానికి కింద పిన్ చేసి డబ్బాలో వెయ్యటానికి వెళ్లాను .


అప్పడే ఆ డబ్బాను ఓపెన్ చేసి ఉత్తరాలు పట్టుకెల్తున్న వ్యక్తి కనిపించాడు.
మీరు రోజూ ఈ ఉత్తరాలు తీసుకెల్తారా ? అని అతన్ని అడిగాను.


"రెండ్రోజులకోసారి తీస్తూ ఉంటాను . వారానికో , రెండు వారాలకో ఓక్కో ఉత్తరం వస్తుంది బాబు  "అన్నాడు ఆ తాత.


నేనూ ఒక ఉత్తరం వేద్దామని వచ్చాను .
అయితే అంతలా ఆ పెట్టె దుమ్ముకొట్టుకు పోవటం చూసి వేసినా ప్రయోజం ఉండదేమో అనుకున్నాను అన్నాను.
తాత వెంటనే పెట్టెను శుభ్రం చేసి , దుమ్ము దులిపాడు . ఇప్పుడు ఉత్తరాలు వస్తాయా బాబు ?  అని అడిగాడు .


తప్పకుండా వస్తాయ్ . ! వారానికి ఒకటైనా , కనీసం నేనైనా వేస్తాను అన్నాను.


సమస్య తీరాకా వ్యక్తి పొందే సంతోషం అంతా అతని కళ్ళలోనే కనిపిస్తుంది .


సంతోషం బాబు . నీ ఉత్తరమిటియ్యి , పెదసారు వెంటనే తీసుకురమన్నారు ..అని నా చేతి లో ఉన్న ఉత్తరాన్ని చాలా భద్రం గా తీసుకెళ్ళాడు .




తర్వాతి వారం నా ఉత్తరం దాని పై నే వెయ్యాల్సి వస్తుందేమో , రిమైండర్ 1 , 2 ,3 .. ఇలా ఉత్తరాలు వెయ్యాల్సి వస్తుందేమో అనుకున్నాను .


అలా జరగలేదు , స్టాప్ అని , వన్ వే అని నాకు రెండు బోర్డులు కనిపించాయి .

ట్రాఫిక్ వాళ్ళు " వన్ వే , డోంట్ గో ఏ హెడ్ " అని రోడ్డుకి ఆ చివర బోర్డు పెట్టించినట్లున్నారు.    
         
ఆ బోర్డు చూస్తే నాకెందుకో పట్టలేని సంతోషం వచ్చింది .
ఆ బోర్డునే చూస్తూ రోడ్డుకి పక్కగానే నిలబడి ఉన్నాను .


ఏం జరిగిందో ఒక్క క్షణం అర్ధం కాలేదు. నిలబడ్డ నేను నేలకొరిగాను. అరచేయి సన్నగా కొట్టుక పోయింది. పట్టలేనంత కోపం వచ్చింది. వేరే ఎవరైనా కారు నడిపి ఉంటే నాకొచ్చిన ఆవేశానికి ఏం చేసేవాడినో  ?


నాకేదో జరిగిందేమో ? అన్నా అనుమానం తో సన్నగా కంపిస్తూ ఓ వృద్దుడు నన్నే చూస్తున్నాడు.
పదిహేను  పదహారేళ్ళు కూడా ఉందని ఇద్దరు అబ్బాయిలు ఒక బైకుతో అతని కారుకి అడ్డంపడ్డారు.వాళ్ళని  తప్పించక  పోయి , కారుని  కంట్రోల్  చెయ్యలేక రోడ్డు చివరన ఉన్న నన్నుడీ కొట్టాడు  .

"నీకేం కాలేదు కదా అమ్మా ? "అని, అతను నన్ను  అడిగాడు.
అతని మాటలకు నాలో  కోపం చచ్చిపోయిందేమో  ?. 

" ఏమన్నా జరిగి ఉంటే ఏం చేసేవారు  ? ఒక వేళ పెద్ద  ప్రమాదమే  జరిగితే  , లైఫ్ లాంగ్ నేను  బాధ  పడాలి ," రోజు  అలా అసలు వెళ్ళాల్సిందే  కాదు , అనవసరం గా ఒకర్ని బాధ పెట్టాను అని మీ మిగిలిన లైఫ్  అంతా కుమిలిపోతూ మీరు బతకాలి. 
 కంట్రోల్ చెయ్యలేక  నన్ను  డీ  కొట్టారు  , ఒక వేళ  వేరే వెహికల్  నైనా   డీ కొట్టి  ఉంటే , ఏం జరిగి ఉండేది ?" ఇదంతా అవసరం అంటారా ?

పెద్దా , చిన్నా లేకుండా నేను మాట్లాడుతున్నాను  అనుకోవద్దు . 
పెద్ద  ఐనా చిన్న ఐనా నేను ఏదైనా విషయం  లో వాళ్ళ  వల్ల  నొచ్చుకుంటే  తప్పకుండా స్పందిస్తాను  , మాట్లాడతాను  .
అది నా నైజం.

నాకేం 
కాలేదు గా మీరు జాగ్రత్త గా వెళ్లి రండి అన్నాను .

అతను వెళ్లి పోయాడు.నేనూ వచ్చేసాను.
కానీ ఇప్పటికీ నా ఆలోచనలు  అక్కడినుంచి రావట్లేదు. 
ఒకటే ప్రశ్ననన్ను వేధిస్తుంది. " తప్పు ఎవరిది ? "  అని . 

వయసు లేకున్నా , వయస్సు  దాటి  పోయినా  రోడ్ల  పై వాహనాలు  నడుపుతున్న  వాళ్లదా  ?
అలాంటి  వాళ్లకు  కూడా లైసెన్సులు   జారీ  చేస్తున్న సర్కారుదా?

మనసులోనే ఖండించుకుంటూ ...
చేతకాని  వ్యవస్థని  , మార్చటం  చేతకాక  , చేతకాని  వాళ్ళలా  మౌనం గా రోదించే నా లాంటి   నా ప్రజలదా ? 

ఎవరిది ?
తప్పెవరిది ?

ఇక మారదా వ్యవస్థ ? మార్చలేమా మనం ? అసలు మార్చే వాళ్ళే లేరా ? ఎలా మార్చగలం ?..


ఒకటే  ప్రశ్న మిగిలింది అనుకున్నాను .. చాలా ప్రశ్నలు వస్తున్నాయి .. నాకైతే ఇవి జవాబు దొరకని చిక్కు ప్రశ్నల్లా అనిపిస్తున్నాయి.


తల నొప్పి మొదలవుతున్నట్లుంది. ఒక స్ట్రాంగ్ చాయ్ పడితే గాని సర్దుకోదు.
లేకుంటే రాత్రికి నిదుర కూడా రాదు .


నేను అసలు ప్రస్తుతం ఏం చెయ్యాలి ? 
సమాధానాలు వెతకటం మాని చాయ్ తాగాలి . 
ఎలాగూ నా గోడు బ్లాగు లో వెల్లగక్కేను కాబట్టి ఎవరో ఒకరు సమాధానం చెప్పక పోరు .


హమ్మయ్య !,  గోడు విన్నవించు కోవటంతో నా మనసు కుదుట పడింది . 
నోట్లో చాయ్ పడనే లేదు., తలనొప్పి తగ్గనే లేదు .. 
నిదుర మాత్రం ముంచుకొచ్చింది . ప్రశాంతం గా పడుకున్నాను  . 
నిద్ర లేవగానే మళ్ళీ బిజీ లైఫ్ స్టార్ట్ అయిపోయింది. ఈ సమస్య ల గురించి , సమాధానాల గురించి మళ్ళీ ఖాళీ దొరికినప్పుడో , 
నాకు మళ్ళీ కష్టం కలిగినప్పుడో , ఏ పది రోజులకు ఒక్కసారో  ఆలోచిస్తాను. ప్రభుత్వాలు చేతకానివని, సర్కారు సరైనది కాదు అని మళ్ళీ విరుచుకు పడతాను ..

నేను మారనంత వరకూ నా వాళ్ళు మారరు. 
నేను నా వాళ్ళు , మీరు  మీ వాళ్ళు , మనం మనవాళ్ళు  అంతా కలిస్తేనే సమాజం ( వ్యవస్థ ).
మనం మారనంత వరకూ వ్యవస్థ మారదు.  మార్చలేము మనం . మార్చే వాళ్ళే ఉండరు .

నా , నా  అంటూ నా కోసం మాత్రమే ఆలోచించుకునే నా లాంటి వాళ్ళు ఉన్నంతకాలం వ్యవస్థ మారదు.
అందుకే నేను మారతాను . నా కోసం కాదు. నా వాళ్ళ కోసం . ( ఇందులోనూ నా సెల్ఫిష్ నెస్ ఉంది ).
నా కోసం కాకున్నా నా సెల్ఫిష్ నెస్ కోసం అన్నా నేను మారతాను .
నేను ఎదుర్కొన్న సమశ్యలు నా వాళ్ళు ఎదుర్కోకుండా జాగ్రత్త పడతాను . కనీసం ప్రయత్నిస్తాను . 
ఎందుకంటే నేనొక  సిటిజన్.



  

4 comments:

  1. " తప్పు ఎవరిది ? "
    వయసు లేకున్నా, వయస్సు దాటి పోయినా రోడ్లపై వాహనాలు నడుపుతున్న వాళ్లదా?
    లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతున్న వారి వివరాలు వెబ్సైట్ లో పొందుపరచాలి. ఒకే వ్యక్తి 3 సార్లు పట్టుబడితే అతను నడుపుతున్న వాహనాన్ని సీజ్ చెయ్యాలి.
    ఒకవేళ కనీస వయసు లేకుండా వాహనాన్ని నడిపితే వాహనాన్ని సీజ్ చేయటం తో పాటు అతని తలిదండ్రుల లైసెన్స్ (ఒక వేళ ఉంటే) కూడా రద్దు చేయాలి. ఇటువంటి వాటికి భారీ జరిమానాలు విధించాలి (కానీ రసీదు ఉండేవే సుమా).
    మద్యం సేవించి వాహనాలు నడపే వారిపై కూడా ఇలానే కఠినచర్యలు తీసుకోవాలి.

    ReplyDelete
  2. బాబోయ్ ట్రాఫిక్ పోలిస్ నే బెదిరించావు అయిన సమజంలో జరుగుతున్న అన్యాయలు చాల ధైర్యంగా చెప్పావు స్వామి చాల బాగుంది. keep posting

    ReplyDelete