Thursday, December 30, 2010

రైతు బతికినా ,చచ్చినా ఒకటే కదా ? ( R E A C T I O N )

ఒక బ్లాగర్ గా నేను స్పందించట్లేదు .
ఒక సామాన్యుడి గా నా స్పందనని తెలియచేస్తున్నాను ..
పచ్చి గా మాట్లాడ్డం రాక నిఖ్ఖచ్చిగా నిజం రాస్తున్నాను.
ఒక రైతు బిడ్డగా కడుపుమండి  రాస్తున్నాను.
రైతుల బతుకులు మీరు వక్రీకరించినంత హీనం గా లేవు అని చెప్పడం కోసమే రాస్తున్నాను !




మీ టపా చూసిన తర్వాత
"ఏనాడైనా రైతుని మీరు ఒక మనిషి గా చూసారా?  లేదా ?  అనే సందేహం కలుగుతుంది "

అని మీరు హెడ్డింకు పెడితే రైతులకోసం ఎవరో పాపం గొంతు చించుకుంటున్నాడు.నేనే రైతు భాంధవుడిని అని కళ్ళ బొల్లి కబుర్లతో కాలక్షేపం చేస్తున్నాడేమో అనుకున్నాను .
కానీ ఇంత నిజాయితీ గా , నిఖ్ఖచ్చిగా , నిష్పక్షపాతం గా , ఎంతో విషయ పరిజ్ఞానం తో 
కళ్ళు చెదిరిపోయే ఇలాంటి ఒక గొప్ప వర్ణనాతీతమైన టపా ఒకటి ఉంటుంది అనుకోలేదు.


"వర్షాలు పడలేదని చంద్రబాబు ప్రభుత్వాన్ని దించేసారు. వర్షాలు పడుతున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దిగమంటున్నారు. అసలు మీకేమి కావాలి? వర్షం కావాలా? ప్రభుత్వం దిగిపోవడం కావాలా? ప్రకృతి ప్రభుత్వం చేతిలో ఉందా?"

ఆహా !, ఎంత సూటి ప్రశ్న మేడం .,

వర్షాలు పడట్లేదని  చంద్రబాబు  ప్రభుత్వం  కూలిపోయిందా ?
వర్షాలు పడుతున్నాయని  కాంగ్రెస్  ప్రభుత్వాన్నిదిగమంటున్నారా ?

నేనేమో అధికారంలో ఉన్నంతకాలం  వ్యవసాయం దండగ  అని  చెప్పి, నేల  వీడి  సాము  చేసినందుకు  బాబు  గారి  ప్రభుత్వం  కూలిపోయింది అనుకున్నాను .


అమ్మా  ప్రకృతి  ప్రభుత్వం   చేతిలో  ఉండదు  . కానీ  ఏదైనా  రాష్ట్రానికి   సంబందించి    నదీ  జలాలు  , సహజ  వనరులు  ఆ  రాష్ట్ర  ప్రభుత్వం  చేతిలోనే  కదా  ఉండేది  ? ( లోక  జ్ఞానం  , విషయ  పరిజ్ఞానం  రెండూ  లేనివాడిని  , ఈ  మాత్రం  కూడా  తెలీదా  అని  నవ్వుకోవద్దు  సుమండీ  )  

సరిపడినంత   వర్షాలు  పడినా  , జీవ  నది  ( గోదావరి  ) పక్కనే  జీవచ్చవం   లా  పడి  ఉంటుందని   ఏనాడూ  ఎవరూ  ఊహించరు  .

మా  ప్రజా  ప్రతినిధులని  , మమ్మల్ని  ఏదో  ఉద్దరించేస్తారని  ఓటు   వేసి  ఎన్నుకున్న  పాపానికి , నదీ  జలాల్ని  సక్రమం  గా  వినియోగించటం  రాని  ఓ  చేతకాని  ప్రభుత్వం  గా  కాంగ్రెస్  మిగిలి  పోయినందుకు  , చరిత్రలో  ఎప్పటికీ  మాయని  మచ్చ గా  మాకు  కరువుని  మిగిల్చినందుకు  ,

పావలా  వడ్డీ  కే  ఋణాలు ,
ఉచిత   కరెంటు లు ,
జల  యజ్ఞాలు  అని  కళ్ళ  బొల్లి  కబుర్లతో  నమ్మబలికి  , అభివృద్ది  పధకాలు  అనే   పదానికే  అర్ధం  తెలియనంతగా  వ్యవహరిస్తున్నందుకు  గానూ  ఈ  ప్రభుత్వానికి  ఈ మద్య   సంక్షోభం  వచ్చింది  అని  నేను  అనుకుంటున్నాను  .

ప్రభుత్వాలు  కూలి  పోవటానికి  ప్రభుత్వాల  చేతకానితనం    కాదామ్మా   కారణం  ?
 “వర్షాలు  – ప్రకృతి  “ నా  ?

వర్షం వచ్చినా ప్రభుత్వం తప్పే, వర్షం రాకపోయినా ప్రభుత్వం తప్పే, మరి మీరు ప్రభుత్వం మీద ఆధారపడి బ్రతుకుతున్నారాప్రభుత్వానికి చెప్పి మీరు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారా? ప్రభుత్వానికి చెప్పి మీరు గంపెడు సంతానాన్ని కంటున్నారా? ప్రభుత్వానికి చెప్పి మీరు తాగుతున్నారా? ప్రభుత్వానికి చెప్పి మీరు శక్తికి మించి అప్పులు చేసి మీ పిల్లల పెళ్ళిళ్ళు ఘనంగా చేస్తున్నారా? ఏవరిది తప్పు? మీరు జల్సాలు చేయడానికి అప్పులు చేసి, పంట నష్ట పోయామని సాయం చేయమని అంటారా? వ్యవసాయమంటే నే వర్షాధారమని తెలియదా? వాన రాకడ...ప్రాణం పోకడ మన చేతిలో లేవని తెలియదా? అన్నింటికీ ప్రభుత్వానిదే తప్పు అయితే మీరు బ్రతికి ఉండి ప్రయోజనమేముంది?


అమ్మా  మేడం,,   
చాలా  మంది  రైతుల్లో  ప్రభుత్వానికి  సెప్పి  పెళ్ళిళ్ళు  సేసుకోవాలి  అని  తెలియని  నిశానోల్లు  ఉన్నారమ్మా  !.. వాళ్ళ  వరకూ  ఏంటి  మూడో  తరగతి   సదువుకున్న  నాకే  తెలియదు ?  ,

భారత  దేశ  జనాభా  నూట  పది  కోట్ల  కి  చేరుకోవటానికి  కారణం  కేవలం  సదువుకోని   రైతే  కదమ్మా   ?


మీలాంటి  గోప్పోల్లకైతే  _________ పద్దతులన్నీ తెలుసు .,
పాపం  గంపెడు  సంతానాన్ని  కనే ఊరోల్లకేమి  తెలుసమ్మా ?
గంపెడు  పిల్లల్ని  కంటున్నారు  అని  బాధ  పడేకంటే  కొంచెం  పెద్దమనసు  సేస్కుని  ఆ  పద్దతులేమో  ఊరోల్లకు   సెప్పరాదూ  ?


ప్రభుత్వానికి చెప్పి మీరు తాగుతున్నారా? ప్రభుత్వానికి చెప్పి మీరు శక్తికి మించి అప్పులు చేసి మీ పిల్లల పెళ్ళిళ్ళు ఘనంగా చేస్తున్నారా? ఏవరిది తప్పు? మీరు జల్సాలు చేయడానికి అప్పులు చేసి, పంట నష్ట పోయామని సాయం చేయమని అంటారా?

అసలు  ఏందండీ  మీ  ఉదేశ్యం ఇక్కడ  ?

“తాగుబోతులు  , పిల్లల  పెళ్ళిళ్ళు  ఘనం  గా  చెయ్యాలని  ఆశపడే  వాళ్ళు   ( అందులోనూ  అప్పులు  చేసి  పెళ్ళిళ్ళు  చేసే  టోల్లు  ), జల్సాలు  చెయ్యటానికి  అప్పులు  చేసెటోల్లు  అందరూ  రైతులే  .కేవలం  రైతులే . రైతులు  తప్ప  వేరే  వాళ్ళెవరూ  ఇలాంటి  పనులు చెయ్యరు  , రైతులంతా  ఇదే  పని  చేస్తారు  “ అనా    ? 
 

ఓ  పెద  రైతు ,  కొడుకుని సదివించు కోవాలి   అని కోరుకోవటం , పిల్లలకి   పెళ్ళిళ్ళు  కొంచెం  ఘనం  గా సెయ్యాలనుకోవటం తప్పే కదండీ.

జల్సాలు  సెయ్యటానికి   అప్పులు  సేసి  , పంట నష్టపోయాం  సాయం  సెయ్యమని  అడుగుతున్నారా ?
ఏందమ్మా  ... ?


 
మీరు బ్రతికి ఉండి ప్రయోజనమేముంది?

రైతు  బతికి  ఉండి  ప్రయోజనం  ఏముంది  ?
శభాష్  అండి మేడం గారూ .. 
ఇంకా  ఎవరూ  ఈ  ప్రశ్న  అడగట్లేదు  ఏంటా  అని  నేను  అనుకుంటున్నాను  .

నిజమే  ఏదో  ఒకటి  సాధించే  వాళ్ళే  బతకాలి ,
పొట్ట కూటికి  కష్టపడేటోల్లు   ,
చదునుచేసి ,దుక్కిదున్ని ,నారుపోసి ,నీరుపెట్టి ,పంటచేసి,పంటకోసి ,కుప్పనూర్చి  ఆకలితీర్చుకునేటోల్లు  అసలు  రైతులెందుకు  బతకాలి?
ఏం సాధించారు అని బతకాలి .వాళ్ళు  లేకున్నా  మనలాటోల్లం ఎంచక్కా భోజనం కొనుక్కోగలం కదా !  

వ్యవసాయం చేసేవాడెపుడూ రెండు గేదెలను తప్పక పెంచుకోవాలి. రెండు గేదెల వల్ల వారికి రోజు వారీ ఖర్చులు  గడచిపోతాయి. సంవత్సరానికి వచ్చే పంట వారికి తదుపరి పెట్టుబడి మరియు ఇతరత్రా నిల్వ ఉంచుకుని వారు ఏదైనా వస్తువులు కొనుక్కుని వాడుకోవడం కానీ దాచుకోవడం గాని చేయాలి. ఇది పద్ధతి. ఇలా చేసే వ్యవసాయదారుడెపుడూ నష్టపోడు. ఒక సంవత్సరం నష్టపోయినా తర్వాతి పంటలో మిగుల్చుకుంటాడు. వర్షం లేనపుడు పూడిక తీసుకోవాలి, వర్షం వచ్చినపుడు గండ్లు తీసుకోవాలి.


అవునా  మేడం ?  “ పద్దతి  “ గురించి  చెప్పటానికా  అమ్మా  మీరు  ఇంత  కష్టపడింది .

ఆలోచిస్తే "ఆయనే  ఉంటే  తెల్ల చీరెందుకు  ? " అన్న  చందాన  ఉందమ్మా  మీరు చెప్పిన విషయం .

పొలాల్లో  కలుపు  తియ్యటానికి  పెళ్ళాల  పుస్తెలు  తాకట్టు పెట్టే  చిన్న  రైతులు ,
పంట  పండినా  పండక పోయినా  బస్తాల  కొద్దీ  శిస్తు  చెల్లించుకునే  కౌలు  రైతులు ,
వీళ్ళా  అమ్మా  “బర్రెలు  కొనుక్కుని  ఇంటిని  గడుపుకునేది  “ ?


వర్షం లేనపుడు పూడిక తీసుకోవాలి, వర్షం వచ్చినపుడు గండ్లు తీసుకోవాలి.
వావ్ ..   వాట్  ఏ   లాజిక్  మేడం   !.
ఈ  లాజిక్  చెప్పే  వాళ్ళు  లేకే  ఇన్నాళ్లుగా  మా  రైతుల  బతుకులు  ఇలా  ఉన్నాయి  .

పంట  సగంలో  ఉన్నప్పుడు  అతివృష్టో , అనావృష్టో వస్తే  అప్పుడు  కూడా  మీ  వాదనే  సరి  అయినదా  ?
 అనావృష్టితో  పంటలు  ఎండి పోయినప్పుడు  , అతివృష్టితో  పంటలు మునిగి పోయినప్పుడు రైతులు  ఏం  చెయ్యాలి ? అది కూడా చెప్పి పుణ్యం కట్టుకోమ్మా !

 
మీరిలాగే నష్టం నష్టం అని మొరిగారంటే ఇంతవరకు రిలయన్స్ కన్ను, కార్పొరేట్ వారి కన్ను వ్యవసాయం మీద పడలేదు. ఇపుడు వాళ్ళు మిమ్మల్ని తోసేసి వాళ్ళే వ్యవసాయం మొదలుపెట్టేస్తారు. అపుడు మీ పొలంలో మీరే కూలీలుగా పనిచేయవలసి ఉంటుంది. ఏదీ అతిగా చేయకూడదు. ఉచిత విద్యుత్తు, ఉచిత ఎరువులు, ఉచిత మద్యం, ఉచిత బియ్యం ఇలా ఎన్ని ఉచితాలు కావాలి? ఇన్ని ఉచితాలు తీసుకుని మీ బ్రతుకులు మారుతున్నాయా? ఎక్కడి వేసిన గొంగళి  అక్కడే అన్నట్లు మీరు అలాగే ఉంటున్నారు. పేరుకి మీకు ఇస్తున్నట్లు రికార్డులు... అసలు మీ దాకా వస్తున్నాయా? మీ పేరు చెప్పుకుని దళారులు బాగుపడుతున్నారు. ప్రభుత్వం పైనుండి రూపాయి పంపితే మీకు దక్కేది 10 పైసలు మిగతాది ఎక్కడికి పోతుంది? మీ నేతల జేబుల్లోకి వెళుతుంది. మీ పేరు చెప్పుకుని వాళ్ళు బ్రతుకుతున్నారు. నిరాహారదీక్షలు , మహా గర్జనలూ వాళ్ళ కడుపులు నింపు కోడానికే గానీ మీ కడుపులు నింపడానికి కాదు. ఉచితాలను కోరుకోకండి. ఊరికే ఏదీ రాదు, ఊరికే వచ్చింది మీ దగ్గర నిలవదు.”

ఈ  పేరా  చదివాకా  మీతో  ఏం  చెప్పాలో  తెలియట్లేదు  మేడం  . ఎందుకంటే నచ్చీ నచ్చకుండా ఉంది.


మొరిగారంటే  .. ?

మీ  కంటికి  ఇప్పటి  వరకూ  రైతు  మనిషిలా  మాత్రమే  కనపడట్లేదు  అనుకున్నాను  . ఇంత  అద్భుతం  గా  కనిపిస్తాడని ,
చెయ్యి  తిరిగిన  రచయితలు  కూడా  మీలా  ఇంత  గొప్పగా  మా రైతుల్ని వర్ణించలేరని ఒప్పుకుంటున్నాను . కనీసం  మేము  మీకు  అలా  అయినా  కనిపిస్తున్నాం , సంతోషం  తల్లీ .


ఇంతవరకు రిలయన్స్ కన్ను, కార్పొరేట్ వారి కన్ను వ్యవసాయం మీద పడలేదు. ఇపుడు వాళ్ళు మిమ్మల్ని తోసేసి వాళ్ళే వ్యవసాయం మొదలుపెట్టేస్తారు. అపుడు మీ పొలంలో మీరే కూలీలుగా పనిచేయవలసి ఉంటుంది.

చిత్తం  తల్లీ  , అలాగేనమ్మా తప్పకుండా  అలాగే  చేద్దురు గాని .
మీరు వత్తాసు పలుకుతున్న  ఈ  ప్రభుత్వాలు  సెజ్  ల  పేరుతో  ఇప్పటివరకూ  చేసింది  అదేకదమ్మా !

మా  పొలాల్లో  పని  చేసుకునే  వెసులుబాటు  మాకు  కల్పిస్తారా  ?
కూలీ  సేస్కుని  నోట్లోకి  నాలుగు  మెతుకులు పెట్టుకునే  అదృష్టం  మాకు  ఉంటుందా  అమ్మా  ? 

ఉచితాలు  ఇస్తున్నాం  అని  చెప్పుకునేది   సర్కారోల్లు .
ఆ ఉచితాలు  కోరుకునేది  దళారోల్లు  . ఆ  విషయం  అయినా  ఒప్పుకున్నారు  సంతోషం  .
లేకుంటే  మీ  సర్కారు  విదిల్చిన  గింజలు తిని  మా  రైతులు  బతుకుతున్నారని  అన్నా  అందురు  .   


దొడ్లో నాలుగు తోటకూర గింజలేస్తే నాలుగే రోజుల్లో తోటకూర మొలుస్తుంది. నాలుగు కోళ్ళు పెంచితే  నాలుగు గుడ్లు పెడతాయి, బస్తా బియ్యం , జాడీడు ఆవకాయ తో, కమ్మటి పెరుగు తో సంవత్సరమంతా హాయిగా గడిపేయవచ్చు.

సొల్యూషన్ మాత్రం  బాగా  చెప్పారండి  మీరు  .

  • దళారుల  చేతి  లో  దారుణం  గా  దగా  పడినప్పుడు   ,
  • చేతికొచ్చిన  పంట  వరద  లో  కొట్టుకు  పోయినప్పుడు ,
  • పెళ్లీడు  కొచ్చిన  ఆడపిల్ల  గుమ్మం  లోనే  తిరుగుతూ  ఉన్నప్పుడు , "కనీసం  కన్న  కూతురి  పెళ్లి  చెయ్యలేనోడివి  ఆ  పిల్లనెందుకు  కన్నావ్ ?" అని  మనస్సాక్షి  ప్రశ్నిస్తున్నప్పుడు  ?
  • సడువుకుని  ప్రయోజకుడవుతాడు  అనుకున్న  కొడుకు  తనతో  పాటే  ఎండనకా ,వాననకా కష్ట  పడుతున్నప్పుడు  , రాళ్ళుకొట్టి,మట్టిమోసి  కందిపోయిన  సేతులతో  అన్నం  కలుపుకోవటానికే  కష్టపడుతున్నప్పుడు .
  • స్కూల్లో  బాగా  చదువుకునే  కుర్రాడమ్మా   , పాపం  ఈడికి  ఈ  గతి  పట్టింది  అని  తన  కొడుకుని  చూసి  జనం జాలి  పడుతున్నప్పుడు  ?
  • “ఏమ్రా  రైతు ? , అప్పు  తీస్కుంటివి. అసలు  , మిత్తి  రెండూ  కట్టాలని  తెలియదేంట్రా ?వర్షాలు  పడక  పోయినా , పంటలు  పండక  పోయినా  , పంట వరదలో కొట్టుక  పోయినా  దానికి  నేనా  భాద్యున్ని  ?నీకు  రెండ్రోజుల  గడువు  ఇస్తున్నా  , ఈలోపు  మిత్తి గా  నీ  పెళ్ళాం  తాళిబొట్టు  నా  కాడ  తనఖా  పెట్టుకుంటా , మొత్తం  డబ్బులు  ఇచ్చి విడిపించుకో ” అని  అప్పులోల్లు  ఇంటి  మీద  పడితే  అప్పుడు  .

మీరు చెప్పిన కమ్మటి పెరుగే గొంతు దిగదు.

ఆ  సందర్భాల్లో  రైతన్న  కట్టుకున్నపెళ్ళానికి  , కన్నబిడ్డలకి  కోరుకున్న బతుకునీయలేక పోయినా  అనీ ,
అయినోల్లకేమీ  సెయ్యలేక  పోయినా  అనీ బాధ  పడతాడు  తప్ప , దేశాన్ని  ఉద్దరిద్దాం  అని  కాదు  .



 
చంద్రబాబు నిరాహార దీక్ష చేస్తే చస్తారు, కె సి ఆర్ నిరాహార దీక్ష చేస్తే చస్తారు, వై ఎస్ ఆర్ చనిపోతే చస్తారు, వాళ్ళు చస్తే వాళ్ళ భార్యలు చావడం లేదు, వాళ్ళ కొడుకులు చావడం లేదు మీరెందుకురా చావడం ?”

ఈ  లైన్స్  నాకు  చాలా  బాగా  నచ్చాయి  .
అయితే  మీరు  రైతులకోసం  చెప్పేటప్పుడు  , ఈ సందర్భం  లో  చెప్పడమే  అంతగా  రుచించలేదు  .
బహుశా ఇవి మీరు రైతులని ఉద్దేశించి రాసిన వాక్యాలు కావనుకుంటా ..


"రైతు ఆత్మహత్యలు ఆపడమెలా ? " అని
మీరు చెప్పిన సొల్యూషన్ ఏంది మేడం ?

ఆత్మహత్య చేసుకున్న సదరు వ్యక్తి కుటుంబాన్ని ( చెట్టంత మనిషిని ,తన ఇంటి ఆధారాన్ని కోల్పోయిన కుటుంబం మొత్తాన్ని)  తీసుకెళ్ళి  బ్రతుకంటే ఏమిటో, బ్రతకడం ఎలాగో తెలియపరచవలసినదిగా మీరు ఈ గొప్ప ప్రభుత్వాలని కోరుకుంటున్నారు .

మరి రైతు చావులకు చలించని ప్రభుత్వాలు ,దళారులు , గొప్ప గొప్ప మహానేతలు ..
చచ్చిపోయిన రైతుని చూసి జాలిపడక పోగా , రైతు  బతికినా చచ్చినా ఒక్కటే అనీ , బతికి మొరగటం తప్ప ఏమీ చెయ్యని (గంపెడు పిల్లల్ని కనే )  వాడని నిర్ధారించేసిన మనలాంటోల్లని ఎక్కడికి పంపాలమ్మా ?

వైతరణీ నది ఒడ్డుకా ?     


-------------------------------------------------------------------------------------------------------------------------------


మేడం  గారు ,
మీ బ్లాగ్ లో నే కామెంట్ చెయ్యటానికి చాలా ప్రయత్నించాను .
అయితే ఎందుకో కుదరటం లేదు . ఒక టెక్నికల్ ఎర్రర్ వస్తుంది . నాకు సిస్టం నాలెడ్జ్ అంత గా లేదు .
అందువల్ల మీ బ్లాగ్ లో వెయ్యాల్సిన కామెంట్ నా బ్లాగ్ లో పోస్ట్ గా వేసాను .

నా అభిప్రాయాన్ని రాసాను . ఎక్కడైనా నొచ్చుకుంటే మన్నించండి .
పిలిచి పరాభవం చేసినట్టుగా భావించొద్దు అని నా విన్నపం ..
మిమ్మల్ని కించ పరచటం గాని , రైతు ఆత్మ హత్యల్ని సపోర్ట్ చెయ్యటం గానీ నా ఉద్దేశ్యం కాదు . గమనించగలరు .